విశాఖ కార్పొరేట్ కాలేజీలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కాపులుప్పాడ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం
మృతురాలు విజయనగరం జిల్లాకు చెందిన నడుమూరు జ్యోత్స్నగా గుర్తింపు
తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విశాఖ నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. గ్రేటర్ విశాఖ పరిధిలోని 4వ వార్డు కాపులుప్పాడలో ఉన్న ఓ కార్పోరేట్ కళాశాల హాస్టల్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన నడుమూరు జ్యోత్స్న (17) కాపులుప్పాడలోని ఓ కార్పోరేట్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇటీవల విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో 450కి పైగా మార్కులు సాధించి, బెటర్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతోంది. శనివారం రాత్రి తోటి విద్యార్థినులతో సరదాగా గడిపిన జ్యోత్స్న, ఆ తర్వాత గదిలో బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆదివారం ఉదయం తోటి విద్యార్థినులు గమనించి వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు జ్యోత్స్నను సమీపంలోని మారికవలస ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సమాచారం అందుకున్న భీమిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని తండ్రి జగన్మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
 

N Nadumuru Jyotsna
Visakha
Visakhapatnam
Corporate College
Student Suicide
Vizianagaram
ইন্টারমিডিয়েট
MPC Student
Andhra Pradesh
হোস্টেল

More Telugu News